What is an Operating System? (in Telugu) ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి?

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి స్మార్ట్ పరికరాల వాడకం చాలా సులభతరంగా మారింది..

కేవలం వీటి స్క్రీన్ పై టచ్ చెయ్యడం ద్వారానో, లేదా మాటల సంకేతాల ద్వారానో మనకి కావలసిన వినోదాన్ని, సేవలని పొందగలుగుతున్నాం...

ఇది ఎలా సాధ్యమైంది?!...

మనం దీని గురించి తెలుసుకోవాలంటే, ముందుగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాని గురించి తెలుసుకోవాలి..

అంటే... ఉదాహరణకు కంప్యూటర్లలో కనిపించే విండోస్, స్మార్ట్ ఫోన్లలో కనిపించే ఆండ్రాయిడ్, ఐ ఓ ఎస్ అనేవాటి గురించి తెలుసుకోవాలి...

ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..



మనం వాడే ఫోన్, కంప్యూటర్, టీవీ మొదలైన స్మార్ట్ పరికరాలు వివిధ రకాల హార్డ్ వేర్ భాగాలతో నిర్మించబడతాయి...

హార్డ్ వేర్ భాగాలంటే.. స్క్రీన్, కీబోర్డ్, కెమెరా, స్పీకర్, మదర్ బోర్డ్ మొదలైనవి..

ఈ భాగాలన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సంక్లిష్టమైన విధానాలతో తయారవుతాయి...

ఓ పరికరం సరిగ్గా పనిచేయాలంటే ఈ హార్డ్ వేర్ భాగాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి...

అంతే కాకుండా, ఇవి మనమిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి..

ఇలా వీటన్నిటినీ కలిపి పనిచేయించడానికి ఉపయోగపడేదే ఆపరేటింగ్ సిస్టమ్.

దీన్ని ఇంకా సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం..

మనం స్మార్ట్ ఫోన్ లో కావలసిన పాటను ప్లే చేసినప్పుడు ఫోన్లోని టచ్ స్క్రీన్, ప్రాసెసర్, మెమరీ, ఇంకా హెడ్ ఫోన్స్ ఒకేసమయంలో కలిసి పనిచేస్తాయి...

అదే మనం కంప్యూటర్ కీబోర్డ్ పై ఒక అక్షరాన్ని టైప్ చేసినప్పుడు... కీబోర్డ్, ప్రాసెసర్, మెమరీ, మానిటర్ వంటివి కలిసి పనిచేస్తాయి..

మన అవసరానికి అనుగుణంగా, స్మార్ట్ పరికరాల అన్నిటిలో హార్డ్ వేర్ భాగాలను కలిపి ఒకేసారి పనిచేయించడానికి, ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఓ.ఎస్ అనే సాఫ్ట్ వేర్ ను వీటిలో ఇన్స్టాల్ చేస్తారు..

ఆపరేటింగ్ సిస్టమ్ ని సిస్టమ్ సాప్ట్ వేర్ అని కూడా పిలుస్తారు..

ఇప్పటి కంప్యూటర్లలో 'విండోస్' ఇంకా 'మ్యాక్' ఓ.ఎస్ లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..

స్మార్ట్ ఫోన్లలో ఐతే, 'ఆండ్రాయిడ్' ఇంకా 'ఐ ఓ.ఎస్' లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..

ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ముఖ్యమైనదంటే, ఇది లేకుండా మనం ఎలాంటి యాప్స్ గానీ, ఇతర సాప్ట్ వేర్ గానీ మన పరికరాల్లో ఇన్స్టాల్ చెయ్యలేం..

యూజర్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఏవిధంగా సహాయపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటిగా, PROCESS MANAGEMENT...

ఓ.ఎస్, మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నిటినీ సరిగ్గా పనిచేయించడానికి కావలసిన పద్ధతులనూ, నియమాలను రూపొందిస్తుంది..

ఒక యాప్ లేదా సాప్ట్ వేర్ చేస్తున్న పనులను అన్నిటినీ క్రమబద్దీకరణ చేసి ప్రాసెసర్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా చేస్తుంది...

రెండోది, MEMORY MANAGEMENT...

పరికరం లో ఉన్న మొత్తం మెమరీ లేదా స్టోరేజ్ విభాగాన్ని ఒకే సమయంలో జరుగుతున్న ప్రాసెస్ లకూ, ఫైల్లకు అవసరమైన విధంగా కేటాయిస్తుంది..

జంక్ ఫైల్లను ఎప్పటికప్పుడు తుడిచిపెట్టి, మెమరీని శుభ్రపరుస్తుంది..

మూడోది, FILE MANAGEMENT....

ఫోన్ మెమరీలోనూ, కంప్యూటర్లోనూ మనం రోజూ ఎన్నో ఫోటోలను, వీడియోలను, డాక్యుమెంట్లను, ఇంకా వివిధ రకాల ఫైల్లనూ భద్రపరుస్తూ ఉంటాం..

ఈ విధంగా భద్రపరచిన సమాచారాన్ని, ఇంకా ఫైల్లనీ మనం తిరిగి పొందడానికి, ఇంకా వాటిని మార్చడానికి వీలుగా ఓ.ఎస్ FILE MANAGER లో నిక్షిప్తం చేస్తుంది..

నాలుగోది, DEVICE MANAGEMENT...

ఓ.ఎస్ పరికరంలో ఉన్న అన్ని హార్డ్ వేర్ భాగాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఒకవేళ ఏదైనా సరిగ్గా పనిచేయనప్పుడు యూజర్ కి వెంటనే తెలియజేస్తుంది..

హార్డ్ వేర్లో కొత్తగా ఏవైనా మార్పులొచ్చినా వాటికి తగినట్టుగా తన పనితీరును మార్చుకుంటుంది..

ఐదవది, SECURITY...

ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల, మెమరీలో ఉన్న మన వ్యక్తిగత సమాచారానికి భద్రత ఏర్పడుతుంది..

హ్యాకర్లు, వైరస్, మాల్వేర్ మొదలైనవాటి బారిన పడకుండా మన పరికరాలకు రక్షణ వ్యవస్థను కలిపిస్తుంది...

ఆరవది, NETWORKING...

ఒక పరికరంలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని భద్రంగా వేరొక పరికరంతో పంచుకునే సౌకర్యం ఓ.ఎస్ ద్వారా మనకి లభిస్తుంది....

దీనివల్ల మన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ఎంతో సులభంగా మారింది..

ఇవన్నీ కాక, ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల వచ్చే మరో ప్రయోజనం, అది మనకు స్మార్ట్ పరికరాల లోపల జరిగే సంక్లిష్టమైన విషయాలను సులువైన వాడుక భాషలో మనకు తెలియజేస్తుంది..

దీనివల్ల మనం కోరుకున్న పనులు స్క్రీన్ పై టచ్ చేసి, కావలసిన ఆప్షన్ ని ఎంచుకోవడం ద్వారా జరిగిపోతున్నాయి...

ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఓ.ఎస్. అన్నది అన్నిటికంటే ముఖ్యమైన సాప్ట్ వేర్ గా మారింది..

కంప్యూటర్లు, స్మార్ట్ పరికరాలు పనిచేయాలంటే ఇది కచ్చితంగా ఇన్స్టాల్ చేయబడి ఉండాలి...

Popular posts from this blog

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?