What is Depression? Causes of Depression (in Telugu) డిప్రెషన్ అంటే ఏమిటి?
ఒకరు ఎంత చిన్నవారైనా, ఎంత పెద్దవారైనా... తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు వారి భావోద్వేగాలను నియంత్రించడం ఎవరివల్లా కాని పని.
అలా ఒకరి భావోద్వేగాలు పూర్తిగా నియంత్రణ తప్పినప్పుడు, అదొక తీవ్రమైన మానసిక సమస్యగా మారుతుంది..
ఈ పరిస్థితినే వైద్యపరంగా డిప్రెషన్ (DEPRESSION) అని పిలుస్తారు.
డిప్రెషన్ వల్ల ఒకరి ప్రవర్తన ప్రమాదకరంగా మారుతుంది. ఆత్మహత్య వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుంది.
అయితే, ఒకరు మానసికంగా అనుభవించే బాధ డిప్రెషన్ గా ఎలా మారుతుంది?
డిప్రెషన్ కు గురవడానికి గల కారణాలను, అలాగే దీనివల్ల వచ్చే సమస్యలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాధ అనేది మనిషిని ఎదురించేలా చేస్తుంది. ఇది వారిలో ప్రతీకార స్వభావాన్ని పెంచుతుంది.. లేదంటే ఆ బాధే వారి మరణానికి కారణం అవుతుంది.
ఒక వ్యక్తి జీవితంలో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, వాటికి ప్రతిచర్యగా వారి మెదడు డిప్రెషన్ అనే స్థితిలోకి వెళ్తుంది.
ఈ దశలో బాధితుల మనసంతా ప్రతికూలమైన ఆలోచనలతో నిండి ఉంటుంది.
ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం డిప్రెషన్ యొక్క ప్రధాన లక్షణాలు.
ఇది జీవితంపై పూర్తిగా నిరాశను కలుగజేస్తుంది.
ఒక వ్యక్తి డిప్రెషన్ బారిన పడడానికి అనేకమైన కారణాలు ఉంటాయి.
చిన్నవయసులో ఒంటరితనం, శారీరక మానసిక హింసలకు గురి కావడం, పేదరికం అనుభవించడం మొదలైనవి వయసు పెరుగుతున్న కొద్దీ ఒకరి మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఇలాంటి వాటివల్ల వచ్చే డిప్రెషన్ జీవితాంతం ఉండిపోయే ప్రమాదం ఉంటుంది.
నిరుద్యోగం, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, పని వొత్తిడి, యాక్సిడెంట్లు, ప్రకృతి విపత్తులు వంటివి కూడా కొంత మందిలో డిప్రెషన్ రావడానికి కారణం అవుతున్నాయి.
కొన్నిసార్లు శారీరక అనారోగ్యం వల్ల కూడా డిప్రెషన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత అధ్యయనాల ప్రకారం.. వైవాహిక జీవితంలో సమస్యలు, అత్యాచారం, ర్యాగింగ్ వంటి విషయాలు కూడా డిప్రెషన్ కి కారణాలుగా మారుతున్నాయి.
డిప్రెషన్ ఒక వ్యక్తి యొక్క ఆలోచనల్ని, అతని చేష్టలని, భావోద్వేగాలని నియంత్రణ లేకుండా చేసి.. చివరికి వారి జీవితాన్ని నాశనం చేస్తుంది.
డిప్రెషన్ తో బాధపడుతున్న వాళ్ళు దేనిమీదా ఆసక్తి చూపించరు.
సాధారణ వ్యక్తులకు ఆనందాన్ని కలిగించే విషయాలు సైతం వీరిలో ఎలాంటి మార్పూ కలిగించలేవు.
డిప్రెషన్ లో ఉన్నప్పుడు, బాధితులు ఒకవేళ భావోద్వేగానికి గురైతే పూర్తిగా సహనం కోల్పోయి ఆత్మహత్య వంటి దారునాలకు సైతం పాల్పడడానికి ప్రయత్నిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్ బాధితులు సుమారు 30 కోట్ల మందికి పైగానే ఉంటారని అంచనా..
డిప్రెషన్ బాధితులకు చికిత్సను అందించే వారిని సైకోతెరపిస్ట్ (PSYCHOTHERAPIST) లేదా మానసిక వైద్యుడు అని అంటారు.
మీకు తెలిసిన వాళ్ళలో, ఎవరిలోనైనా డిప్రెషన్ లక్షణాలు ఉన్నట్లైతే వారికి తోడుగా నిలవండి. వారి గురించి ఒక మానసిక వైద్యుని సంప్రదించండి.